
జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారం ముదురుతోంది. సంచలనం రేపుతున్న సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasareddy) కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. తన ప్రమేయం లేకుండానే సెకితో ఒప్పందం జరిగిపోయిందన్నారు. అర్థరాత్రి 1 గంటకు లేపి తనను సంతకం చేయమని అడిగారని, అంత పెద్ద ఒప్పందం గురించి తనతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే.. ఏదో మతలబు ఉందనే తాను సంతకం చేయలేదన్నారు. ఒప్పందం వివరాలు పూర్తిగా తెలియకుండా సంతకం ఎలా చేస్తారని తన పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేశాడని చెప్పారు. కాసేపటి తర్వాత ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్.. తన అదనపు పీఎస్కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని, ఆ తర్వాతి రోజు ఆ ఒప్పందాన్ని కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. సెకి ఒప్పందంపై అంత గూడుపుఠాణీ ఉందని తనకు తెలియలేదని వ్యాఖ్యానించారు.
శ్రీకాంత్ చెప్పినట్లే కేబినెట్ ముందుకు ఆ ఒప్పంద పత్రాలను తీసుకెళ్లానని, మంత్రిమండలిలో దానిని ఆమోదింప చేసుకున్నారని వివరించారు. ఒప్పందం పై ఎక్కడా తాను ఒక్క సంతకం కూడా చేయలేదన్న బాలినేని.. అంతా ఒక పెద్ద మంత్రి నడిపించారన్నారు. అడపాదడపా శ్రీకాంత్ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు. అలాంటి ఒప్పందం గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని బాలినేని పెదవి విరిచారు.
Editor: Ramesh Rao
All Rights Reserved | Mana Prajavaani - 2025