
అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డిప్యూటీ డైరెక్టర్ పదవి రేసులో భారత సంతతి యువతేజం 44 ఏళ్ల కాష్ పటేల్(Kash Patel) ముందంజలో ఉన్నారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు వీర విధేయుడిగా పేరుండటంతో ఆయనకు ఈ కీలక పదవి దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ట్రంప్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకొని ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం కాష్ పటేల్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (2020 సంవత్సరంలో) సీఐఏ డైరెక్టర్, ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ పదవుల కోసం కాష్ పటేల్ పేరును ట్రంప్ పరిశీలించారు. అయితే అప్పట్లో వాటిని కేటాయించడం సాధ్యపడలేదు. అందుకే ఈసారి ఏదైనా ఒక కీలక పదవిని తన అనుచరుడు కాష్ పటేల్‌కు కట్టబెట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.
కాష్ పటేల్ తల్లిదండ్రులు భారత్‌లోని గుజరాత్ నుంచి ఆఫ్రికా దేశం ఉగాండాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి కెనడాకు.. కెనడా నుంచి అమెరికాకు చేరుకొని స్థిరపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్‌లో 1980లో కాష్ పటేల్ జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను ఆయన పూర్తి చేశారు. కాగా, మాజీ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ మైక్ రోజర్స్ పేరును ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో సెనేట్ స్థానానికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో రోజర్స్ ఓడిపోయారు.
Editor: Ramesh Rao
All Rights Reserved | Mana Prajavaani - 2025