
రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అద్దె ఎవరి ఖాతాలో చేరుతున్నది..?
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సమాధానం చెప్పాలి
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్
మంథని: మన ప్రజావాణి జూన్ 10
పెద్దపల్లి జిల్లా మంథని కోర్టుకు ఎదురుగా నిర్మించిన రిటైర్డ్ పెన్షనర్స్ భవనం ఎవరి ఆధీనంలో నిర్వహించబడుతుందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్లా శివకుమార్ ప్రశ్నించారు. రిటైర్డ్ పెన్షనర్స్ భవనం నిర్వహణ వలన రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలోని ఎంతమంది నాయకులు లాభపడుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ నాయకులను సూటిగా ప్రశ్నించారు.ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశారా? లేక ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని నిర్మించారో తెలియదు కానీ పేరుకు మాత్రమే రిటైర్డ్ పెన్షనర్స్ భవనంగా కొనసాగుతున్నదని అన్నారు. అందులో కొనసాగేది మాత్రం ప్రైవేటు వ్యక్తుల సొంత లాభాల వ్యాపారం అని మండిపడ్డారు.
రిటైర్డ్ పెన్షనర్స్ పేరుతో ఏర్పాటు చేసిన భవనాన్ని రిటైర్డ్ పెన్షనర్స్ అవసరాల కోసం ఉపయోగించకుండా ప్రైవేట్ వ్యక్తులకు కిరాయికి ఇచ్చి కిరాయి ద్వారా వచ్చే సొమ్మును రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం లోని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు తమ సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.రిటైర్డ్ పెన్షనర్స్ భవనం దూర ప్రాంతాల నుంచి వచ్చే పెన్షనర్స్ కు ఉపయోగపడడం లేదని అన్నారు. సంఘంలో సభ్యత్వం పొందిన రిటైర్డ్ ఉద్యోగులు తమ అవసరాలరీత్యా మంథని పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు రిటైర్డ్ పెన్షనర్స్ భవనం అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. మంథని చౌరస్తాలోనే ఏదో ఒక హోటల్లో తమ పెన్షన్ కు సంబంధించినటువంటి దరఖాస్తులను నింపుకొనే దుస్థితి ఉందని అన్నారు. ఏదో ఒక నీడన తమ కాగితాలను సరిచూసుకొని సంబంధిత ఆఫీసులో అప్పగించి అలసటతో వెనుతిరిగి వెళ్తున్నారని అన్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు రిటైర్డ్ ఉద్యోగస్తుల నుండి ప్రతి సంవత్సరం సభ్యత్వ రుసుము వసూలు చేసినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో మాత్రం కూర్చునే అదృష్టాన్ని ఎందుకు కలిగించడం లేదని నిలదీశారు. అంతేకాకుండా రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని ఇతర వ్యక్తులకు కిరాయి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులను కూడా సంఘం యొక్క అవసరాలకు గానీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గానీ ఉపయోగించడం లేదని అన్నారు. సంఘ భవనం కిరాయి ద్వారా వచ్చే డబ్బులను సంఘంలోని కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని సంఘంలోని కొంతమంది విశ్రాంత ఉద్యోగస్తులు వాపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో ఒక గదిని రిటైర్డ్ పెన్షన్ దారులు తమ కనీస అవసరాల కోసం ఉపయోగించుకునేలా తయారు చేయాలని కోరారు. రిటైర్డ్ పెన్షనర్లు అందులో వారికి కావలసిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారనీ తెలిపారు. విశ్రాంత ఉద్యోగస్తులకు ఉపయోగపడని రిటైర్డ్ పెన్షనర్స్ భవనాన్ని పూర్తిగా మూసివేసి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘంలో సభ్యత్వం పొందిన కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు తమలో తామే చర్చించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ తెలియజేశారు.