
కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీరాకెట్ ముఠా అరెస్ట్..
సూర్యాపేట జిల్లా కోదాడ, జూన్ 25/మన ప్రజావాణి.
సినిమాలకు దీటైన మోసాలు కోదాడలో వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీరాకెట్ ముఠా ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పదిమంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి, విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకుని, కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికే స్కామ్‌కు పాల్పడినట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్నీ ఫోర్జరీ పత్రాలతో సిద్ధం చేసి, బాధితులను మరియు దాతలను ఏర్పాటుచేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.అయితే ఆపరేషన్ సమయం దగ్గరపడినప్పుడు, ముఠా సభ్యులు బాధితులను వదిలేసి పారిపోతూ, డబ్బులను పంచుకునే కుతంత్రం చేపట్టినట్లు చెప్పారు. గతేడాది డిసెంబరులో కోదాడ శ్రీరంగపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇదే విధంగా మోసానికి గురై, 22 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా దాదాపు పదిమందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీలు మార్పిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ముఠాలో ఆరుగురు.. కడుపూరి తాతారావు, కొండా రమాదేవి, బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణు వర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్ లు ఇప్పటికే అరెస్టుకాగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా విచారణ జరిపి నిందితులను పట్టుకున్న సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్ మరియు వారి బృందాన్ని డీఎస్పీ అభినందించారు.