
*భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం…*
*ఇద్దరు మృతి..ఒకరు సీరియస్ గాంధీ ఆసుపత్రికి తరలింపు.*
*బ్రేక్ ఫెయిల్ దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.*
*రోడ్డుకి అడ్డంగా లారీ..ఇరువైపులా ట్రాఫిక్ జామ్.*
*క్రేన్ సాయంతో లారీని తొలగించిన పోలీసులు.*
*యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు / 03 / మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక జగదేవపూర్ చౌరస్తాలో ఆదివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ జిల్లా పోతిరెడ్డిపాడుకు చెందిన చిన్న మామిడి రామకృష్ణ యాదవ్ (35) అక్కడక్కడ చనిపోగా , చిన్న మామిడి సాయికుమార్ (22) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. రామన్న పేట మండలం తుమ్మల గూడెంకు చెందిన శివకుమార్ (33) అనే మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ప్రజలు , పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జగదేవపూర్ నుండి నల్లగొండకు బట్టల లోడుతో వస్తున్న లారీ జగదేవపూర్ చౌరస్తా వద్దకు వస్తున్న తరుణంలో లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకుపోవటం జరిగింది. దీనితో ఆ షాపు ముందే నిలబడిన చిన్న మామిడి రామకృష్ణ యాదవ్ లారీకి గోడకి మధ్యలో ఇరుక్కొని అక్కడికక్కడే మరణించగా , చిన్న మామిడి సాయి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అదేవిధంగా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన శివకుమార్ కూడా తీవ్ర గాయాలు అవటంతో అతని కూడా గాంధీకి తరలించారని జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ , క్లీనర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీనితో వీరిని కూడా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జగదేవపూర్ చౌరస్తా వద్ద లారీ అడ్డంగా నిలవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కావడంతో ఘటనా స్థలంలో పెను ప్రమాదం తప్పింది. జగదేవపూర్ చౌరస్తా కూలీలకు అడ్డా. చౌరస్తా వద్ద వివిధ పనులకు పోయే అడ్డా కూలీలు వందల సంఖ్యలో అక్కడికొస్తారు. కాంట్రాక్టర్లు , బిల్డింగ్ నిర్మాణం మేస్త్రీలు చౌరస్తా కొచ్చి , వారిని పనుల్లోకి తీసుకుపోతుంటారు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఆదివారం కావడంతో , కూలీలు ఎవరు పనులకు రాలేదు. ఈ ప్రమాదం ఆదివారం కాకుండా మరో రోజు జరిగే ప్రజలు , ముఖ్యంగా నిరు పేదలైన కూలీలు పెద్ద సంఖ్యలో ఈ ప్రమాదానికి గురయ్యే వారని ఘటనా స్థలంలో ఉన్న స్థానిక ప్రజలు తెలిపారు.









