
* తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం...!
*ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం*
10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి
* పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి..
వీరభద్రం సీనియర్ జర్నలిస్ట్ మన ప్రజావాణి తెలుగు దినపత్రిక
ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. తొలి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు హోరెత్తనున్నాయి. ఈరోజు సాయంత్రం హనుమకొండ వేయి స్తంభాల గుడిలో నిర్వహించే ఆరంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు హాజరవుతున్నారు. ఇప్పటికే వేయిస్తంభాల గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ కోరారు.
*బతుకమ్మ పూల పండుగకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...!
పూల పండుగ సందర్భంగా రాష్ట్ర ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025