
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి (Comedian Ali) ఊహించని షాక్ తగిలింది. అక్రమ నిర్మాణాలపై (illegal constructions) ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ (Vikarabad) నవాబ్ పేట, ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 345 లో మహమ్మద్ అలీ తండ్రి దివంగత మహమ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉన్నది. ఈ ఫామ్ హౌస్ లో గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈనెల 5న మొదటి నోటీసు జారీ చేశారు. ఆ నోటీసుకు ఎలాంటి రిప్లై రాకపోవడంతో మళ్ళీ గత నవంబర్ 22 న శుక్రవారం మరో నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీలో ఇవ్వాలని తెలిపారు. కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని ఆరోపిస్తున్నారట అలీ. అయితే.. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025