
క్లాస్ రూంలో తాజ్‌మహల్ పాఠం చెప్పడం కాదు.. తాజ్‌మహల్ పక్కనే ఉండి వివరిస్తున్నట్టుగా ఉంటే.. విత్తనం మొలకెత్తే దగ్గర్నుంచి.. చెట్టుగా మారి.. పూలు, కాయడం మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి వస్తే.. విద్యార్థులకు ఈ థ్రిల్లే వేరు. సబ్జెక్ట్‌పై మంచి అవగాహన రావడమేకాదు, చదువుకోవడం, నేర్చుకోవడంపై మరింత ఆసక్తి కలగడమూ ఖాయమే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ తరహా డిజిటల్ బోధన అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ విధానాల్లో పాఠాలు బోధించే ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది.
ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై పరిశీలన జరుపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా దీనిని అమల్లోకి తీసుకురానుంది. ఇటీవల రాష్ట్రంలో డిజిటల్ విద్యా బోధనపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా.. అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. విద్యాశాఖ అధికారులు డిజిటల్ బోధనకు గల అవకాశాలు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను సేకరిస్తున్నారు. నిపుణులతో చర్చించి నివేదిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.