
*స్వగ్రామం చేరిన వలస జీవి మృతదేహం*
రాయికల్:నవంబర్ 19(ప్రజావాణి)
ఉన్న ఊళ్ళో ఉపాధి లేక,గంపెడు ఆశతో నాలుగు పైసలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించాలని విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస జీవి శవపేటికలో శవమై బుధవారం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాయికల్ పట్టణానికి చెందిన సుతారి ధర్మయ్య అలియాస్ తోట ధర్మయ్య సౌదీ అరేబియా దేశంలో జెద్దాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధర్మయ్య పొట్ట చేత పట్టుకుని 10 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు.అప్పటి నుండి అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పని చేసుకుని రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడని తోటి కార్మికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.కాగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,సాటా కోర్ టీం సభ్యులు సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సహాయంతో హైదరాబాద్ నుండి రాయికల్ వరకు ఉచిత అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకురావడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ధర్మయ్య అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను వారు చూసుకున్నారు.మృతుడికి భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు.నిరుపేద మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సాటా రియాద్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ,కోర్ టీం సభ్యులు కోరుతున్నారు.









