
నిబంధనలు పాటించని ఒక ప్రైవేట్ యాజమాన్యంపై ఉస్మానియా యూనివర్సిటీ చర్యలకు దిగింది. సదరు కాలేజీ అఫిలియేషన్ ను రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేసిన ఓ కళాశాలపై ఓయూ యాక్షన్ తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిలైనట్లుగా, ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తప్పుడు సమాచారాన్ని అందించిన హిందీ మహావిద్యాలయ అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. 2019-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా, ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులు ఫెయిలైనట్లుగా తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయం సమర్పించింది. సదరు విద్యాసంస్థ టీఆర్(ట్యాబులేషన్ రికార్డ్స్) రికార్డులపై అనుమానం రావటంతో.. ఓయూ అధికార యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది.