
ఖమ్మంలో ఆంధ్రా భూ బకాసురుడి అరాచకం
బకాసురుడు చేష్టలకు యంత్రాంగాలు అతలం కుతలం…?
ఆంధ్ర నుండి తెలంగాణకు మారిన అడ్డా..?
ప్రైవేటు సైన్యం పహారాలో జోరుగా సెటిల్మెంట్ లు…!
ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి
ఏపీలో వెలగబెట్టింది చాలక తెలంగాణలోనూ విచ్చలవిడి అక్రమాలు , ఖమ్మంలో ఎన్నారై భూములపై కన్నేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ల పరంపర , అమ్మపాలెంలో అమ్ముడుపోయిన ఆర్బీఐ నిబంధనలు.. యధేశ్చగా కోర్టు ధిక్కరణ , ఏపీలో గత ప్రభుత్వ పెద్దల తాలూకా మనిషినంటూ బరితెగింపు , ఇప్పుడు ఖమ్మాన్ని తాకిన ఆంధ్రా రియల్ ఎస్టేట్ విష సంస్కృతి , తొలుత రిజిస్ట్రేషన్.. ఆనక 60-40 పర్సెంటేజీతో సెటిల్మెంట్ , ఖమ్మంలో కొత్త తరహా సెటిల్మెంట్లకు బొడ్డు కోసిన “కొత్తా దేవుదండీ”! ,నయీమ్ తరహా నయా దందాతో వణికిపోతున్న ఖమ్మం నడి బొడ్డు , ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల నడుమ ఉన్న ఖమ్మం జిల్లా రెండు రాష్ట్రాల మిశ్రమ సంస్కృతికి పెట్టింది పేరు.. కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం గడ్డ రాజకీయ చైతన్యానికి నిజంగా ఓ కొలమానమే.. అలాంటి ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగానికి అమితమైన ప్రాధాన్యం ఉంది.. అయితే భూ వ్యాపారం నేలను విడిచి ఆకాశాన్ని తాకిన రోజుల్లోనూ ఇక్కడ నిబంధనల ఉల్లంఘన తలెత్తింది లేదు.. కాగా ఓ ఆంధ్రా నయవంచకుడు ఖమ్మం రియల్ ఎస్టేట్ లో నయీమ్ మాదిరి ఆగడాలకు బరితెగిస్తున్నాడు.. మునుపెన్నడూ లేని చందంగా ఖమ్మంలో నయా విష సంస్కృతికి పురుడు పోశాడు.. ఇక్కడి ఎన్నారై భూములపై కన్నేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కోట్లల్లో సెటిల్మెంట్ కు తెర లేపాడు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు కొలువై ఉన్నప్పుడు నాటి ప్రభుత్వ పెద్దల పేర్లను ఎంచక్కా వాడుకున్న ఈ ప్రబుద్ధుడు అటు ఆంధ్రాలో ఇటు హైదరాబాద్ లో రియల్ దందా సాగించాడు. సీఎం పేషీలో ప్రముఖుల పేర్లు వల్లెవేస్తూ రియల్ ఎస్టేట్ పైరవీలు నడిపాడు. ఇప్పుడు దినదినాభివృద్ది చెందుతున్న ఖమ్మంపై అతగాడి దృష్టి పడింది.. “కోర్టు వివాదంలో ఉన్న భూములైనా.. ఎన్నారైలకు చెందిన భూమి అయినా.. పోరంబోకు భూములైనా.. ఇక మీ భూమిలో ప్రభుత్వ భూమి కలిసి ఉన్నా సరే.. అసలు పూర్తిగా సర్కారు స్థలమే అయినా సరే.. చివరికి అది అసైన్డ్ భూమి అయినా ఫర్వాలేదు.. నేను చెప్పిన పేరిట రిజిస్ట్రేషన్ చేయండి.. అంతే చాలు.. మిగతాది నేనే చూసుకుంటా” అంటూ ఖమ్మంలో విలువైన భూములపై గద్దలా తిరుగుతున్నాడు. ఇలా భూములను అన్యాక్రాంతం చేసే క్రమంలో ఎలాంటి పరిణామాలకైనా తనదే బాధ్యత అంటూ భరోసా ఇస్తున్నాడు. రిజిస్ట్రేషన్ తర్వాత 60-40 పర్సంటేజీతో సెటిల్మెంట్ చేయడాన్ని ఇతను ఆనవాయితీగా మార్చుకున్నాడు. “రెండు రాష్ట్రాల్లో పోలీస్ పవర్ నా చేతిలో ఉంది.. రెవెన్యూలో ఎలాంటి రికార్డు కదలాలన్నా నాకు చిటికెలో పని.. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చి నేను చెప్పిన పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే అంతే చాలు.. భూమిపైకి వెళ్లేటప్పుడు ఎవరడ్డు వచ్చినా నేనే చూసుకుంటా.. పరిస్థితి చేయి దాటితే రౌడీలను రంగంలోకి దించుతా.. లోకల్ రౌడీలు సరిపోకపోతే హైదరాబాద్ నుంచి గుండాలను దించుతా..” క్లుప్తంగా ఇది ఆ భూ బకాసురుడి తీరు. భూముల అన్యాక్రాంతం కోసం ఎంతకైనా తెగించి, దేనికైనా బరితెగించడంలో అతను “ప్రవీణు”డు. ఖమ్మంలో నయా నయీమ్ తరహాలో రెచ్చిపోతున్న ఈ భూ బకాసురుడి వీర విహంగానికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. ఇతగాడి పోకడకు నివ్వెరపోవడం వ్యాపారులు , బాధితులవంతవుతోంది .
నిబంధనలు హుష్ కాకి.. ఓ ఎన్నారై భూమి రిజిస్ట్రేషన్..?
భారతదేశాన్ని విడిచి విదేశీ పౌరసత్వం పొందిన ఎన్నారైలు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసే విషయంలో చట్ట ప్రకారం కొన్ని నిబంధనలున్నాయి. అవేంటంటే.. ఎన్నారైగా ఉన్న వ్యక్తి భారతదేశంలో ఫార్మ్ హౌస్ గానీ, వ్యవసాయ భూమి కానీ, ప్లాంటేషన్ భూమి కానీ కొనుగోలు చేయకూడదు. ఇలా ఒక వేళ కొనుగోలు చేయాలంటే ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా కొనుగోలు చేస్తే భూమి విలువకు మూడు రెట్ల జరిమానాను భారత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఎన్నారైలు కొనుగోలు చేసిన భూమిని మరొకరికి విక్రయించడం కూడా చట్ట ప్రకారం నిషిద్ధమే అవుతుంది. అలాంటి భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసే “ప్రావీణ్యం” మన సిద్ధహస్తుడికే చెల్లుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రానికి చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు ధర పరంగా రెక్కలు తొడుక్కున్నాయి. దీంతో రియల్ భూ బకాసురులు భూముల అన్యాక్రాంతానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఖమ్మం నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపాలెంలో ఈ ఆంధ్రా కబ్జాకోరు ఒక ఎన్నారైకి చెందిన ఎనిమిదెకరాల భూమిపై కన్నేశాడు. ఈ భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ ఒక బినామీ పేరిట జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈక్రమంలో ఆర్బీఐ నిబంధనలతో పాటు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడ్డాడు. ఒకవేళ వివాదం చోటుచేసుకుంటే రౌడీయిజాన్ని ప్రదర్శించడం, గుండాగిరీకి దిగడం కోసం మందీ మార్బలాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఈ భూమికి పక్కనే ఉన్న మరో వివాదాస్పద భూమిలో సైతం రూ.3 కోట్లను బయానా రూపంలో పుచ్చుకోవడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఇలా వివాదాల్లో ఉన్న భూములను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ తర్వాత ఆ వివాదాన్ని మరింత పెంచి పెద్ద చేయడాన్ని ఇతగాడు తన నైజంగా మార్చుకున్నాడు. ఈక్రమంలో పోలీసింగ్, రెవెన్యూతో పాటు ఇతర ప్రభుత్వ యంత్రాంగాలను సైతం యధేశ్చగా వాడుకుంటూ, అవసరమైతే రౌడీలను రంగంలోకి దించి ప్రత్యర్ధులను,బాధితులను బెంబేలెత్తిస్తున్నాడు.
ముగ్గురు మంత్రులున్న జిల్లాలో కొనసాగుతున్న అక్రమ దందాలు..?
రాష్ట్రంలో ఏ జిల్లాకు పట్టని అదృష్టం ఖమ్మం జిల్లాకే పట్టింది. ఎందుకంటే ఇక్కడి నుంచి రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులు కొలువై ఉన్నారు. ఇందులో ఒకరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా మరొకరు ఎంతో కీలకమైన రెవెన్యూశాఖ మంత్రి కావడం విశేషం. ఇలాంటి ఖమ్మం జిల్లాలో ఆంధ్రా నుంచి వచ్చిన ఒక భూ బకాసురుడు హల్చల్ చేయడమే విడ్డూరం. కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగి అత్యంత చైతన్యం కలిగిన మేధావులున్న ఈ జిల్లాలో ఓ వ్యక్తి ఇక్కడి భూములపై రాబంధులా మారి పెత్తనం చేయడం విస్మయం కలిగిస్తోంది. అలాగే సీఎం పేషీలో ప్రముఖుల పేర్లు చెబుతూ ప్రభుత్వ యంత్రాగాలను సైతం ప్రభావితం చేస్తున్న తీరు విస్తుగొలుపుతోందని తెలంగాణ ప్రజా చైతన్య వేదిక తరపున ఖండించారు.